Monday, September 27

ఎస్ వి రంగారావు గారి బయోగ్రఫీ

Sv rangarao biography :

ఎన్టీఅర్ తర్వాత ఏమిటి.. ఎన్టీఆర్ కంటే చాలా చాలా గొప్ప నటుడు.. కను బొమ్మలతోనే నవరసాలు పండించగల గొప్ప నటుడు…
చార్లీ చాప్లిన్ వంటి గొప్ప నటుడితోనే ప్రసంసలు అందుకొన్న మహోన్నత వ్యక్తీ… ఎస్వీఆర్. నట యశస్వి ఎస్వీ రంగారావు.
నట యశస్వి.. సుప్రసిద్ధ తెలుగు నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీ రంగా రావు) గారి జయంతి నేడు.. ఎస్వీ ఆర్ జూలై 3, 1918 లో కృష్ణా జిల్లా నూజివీడు లో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు..
తండ్రి ఎక్సైజ్ శాఖ లో ఉద్యోగి.. నూజివీడు లో పనిచేస్తున్న సమయంలో ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం కాకినాడ..
ఆర్ధికంగా ఉన్నత కుటుంబం కావడంతో.. ఎస్వీఆర్ ని హైస్కూల్ చదువుకోసం మద్రాస్ పంపించారు..
తన 12 వ ఏటనే, హైస్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు.. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బందరు లో అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా జాబ్ లో చేరారు..
ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు.
ఎస్వీఆర్ బంధువైన బి.వి.రామానందం గారు తాను తీయబోయే సినిమాకోసం SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. అందుచేత కొంతకాలం వరకు వారికి సినిమాలలో వేషాలు వేసే అవకాశం రాలేదు.
తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి, జంషెడ్ పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసారు.
అయితే అతనికి నటన పైన ఉన్న ప్రేమ తొలగిపోలేదు, పైగా ఎక్కువ కూడా అయింది.
27-12-1947 న లీలావతి తో వీరి వివాహం జరిగింది.
SVR గారికి ‘పల్లెటూరిపిల్ల’ అనే చిత్రంలో విలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది.. కానీ అదే సమయంలో ఆయన తండ్రి స్వర్గస్తులైనారు.. దీంతో ఆ సినిమాలో అవకాశం చేజారి పోయింది.
కానీ ఆయన అదృష్టమేమంటే–విజయా వారి, కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే! పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది.
వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు.
ఆ తర్వాతనే విడుదలైన విజయా వారి ‘పెళ్లిచేసిచూడు’ సినిమాలో ఎస్వీఆర్ పోషించిన ‘వియ్యన్న’ పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
విజయా వారు మాయాబజార్ తీసేటప్పుడు, ‘ఘటోత్కచుని’ వేషానికి ముందుగా ఎస్వీఆర్ని తీసుకున్నారు. కే.వి.రెడ్డి గారు అన్నారుట ‘ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు’ అని. మాయాబజార్ అంత రసవత్తరంగా తయారు కావటానికి ముఖ్యకారకులలో అతిముఖ్యుడు ఎస్వీఆర్! అలా నిర్విరామంగా వీరి నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది.
ఎస్వీఆర్ నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు, చైనా ప్రధాని చౌ యెన్ లై , వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట! జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో, ఎస్వీఆర్ కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది.
ప్రపంచం గుర్తించిన తెలుగు నటుడు రంగారావు. 1963 లో జకార్తా లో నర్తనశాల లోని కీచక పాత్రతో… ఆఫ్రో- ఏషియన్…బెస్ట్ యాక్టర్ అవార్డ్ కైవశం చేసుకుని….విదేశీయుల మన్నన లను పొందినా… 4- రాష్ట్రపతి అవార్డులు కూడా….తమిళ మూవీలే అందించాయి!
2- నందులు- చదరంగం(1967)& బాందవ్యాలు(1968). విశ్వనట చక్రవర్తి….నటసార్వభౌమ….నటశేఖర….నట సింహ…..ఇలా ఎన్నో బిరుదులున్నా…..ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులేమీ రాలేదు అనితరసాధ్యమైన నటనాగ్రేసరుడికి! ఆయన పేరుతో ఓ స్టాంప్ రిలీజ్ చేసింది. అంతే.
ఎస్వీయార్ ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీని ప్రవేశపెట్టారు. రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, మాయల పకీరు, మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిరస్థాయిగా కూర్చో పెట్టాయి. ఆయన పలుకులు అప్పట్లో అందరికీ ఊతపదాలయిన మాటల తూటాలు
పులి ఎక్కడున్నా పులేరా డోంగ్రే… పోరా గూట్లే.. సాహసం సేయరా డింభకా,…. హ్ బానిస…..బానిసలకింత అహంకా రమా….. మాతాతయ్యకు నేడు 99వ పుట్టినరోజు జేజేలు… వంటి సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, హావభావాలు మరెవరి తరంకావు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు.
ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు.
ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
ఎంత మహా నటుడినైనా Dominate చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప! ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే, ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు..
బంగారు పాప సినిమాలో ఎస్‌.వి.రంగారావు గారి నటనను, లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. కానీ ఇప్పటి వరకూ ఏ పద్మ లు అందుకొని మేటి నటుడు ఎస్వీఆర్ శతజయంతి జయంతి నేడు..
మద్రాస్ లో చదువుకోవడం వల్ల….వంట బట్టిన తమిళం….ఉభయభాషా ప్రవీణుడ్ని చేసింది..తమిళం లోనూ ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించగలిగాడు….తమిళుడే….ఇతను అనిపించేలా! తనకొచ్చిన అవార్డులు కూడా తమిళంలోనే ఎక్కువ! బళ్ళారి రాఘవ గారి నటన….వేమూరి గగ్గయ్య గారి నటన నచ్చేది ఎస్వీయార్ చిన్నప్పుడు. రంగారావ్ స్టార్ కావడానికి వెనుక ఎంత మథన, కృషి ఉన్నాయో….అందరికీ ఎలా తెలుస్తుంది!?
స్టార్ అయ్యాక…ఎన్నెన్నో పాత్రలు వచ్చాయి. వచ్చినవన్నీ రంగారావు ఒప్పుకోలేదు. ఒప్పుకుని…తప్పుకున్నవీ ఉన్నాయి! రంగారావుని భరించలేం అన్నవాళ్ళు…ఆ పాత్రకు రంగారావే తగినవాడని అనిపించినా, వేరే నటుల్ని పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి! ట్రబుల్ సం ఆర్టిస్ట్ అన్న ముద్ర కూడా పడింది!
బాపు అందరి ఆర్టిస్టులతో బాటు… ఎస్వీయార్ కేరికేచర్ కూడా వ్రాస్తూ…కేప్షన్ వ్రాశాడు. ఎస్వీయార్కే నవ్వొచ్చింది.
క్లిష్టపాత్రల్లో…చతురంగారావు,
దుష్ట పాత్రల్లో…క్రూరంగా రావు,
హడలగొట్టే…భయంకరంగారావు,
హాయిగొలిపే…టింగురంగారావు,
అలరించే….విలాసంగారావు,
రొమాన్సు లో(చేయిస్తే)..పూలరంగారావు,
మనిషి…మధు మధురంగారావు,
మాటల్లో…మహ చమత్కారంగారావు,
కథ నిర్బలమైతే…హావభావాలు పాత్రపరంగారావు,
కళ్ళక్కట్టినట్టు కనపడేది…ఉత్తి యశ్వీరంగారావు,
ఆయన శైలీ ఠీవీ….అన్యులకు సులభంగారావు,
ఒకొక్కసారి డైలాగుల్లో మాత్రం…యమ కంగారంగారావు!*
గుండెపోటుతో 56 ఏళ్ళకే….తన జీవన నాటకానికి….తెర దించేస్తుందని రంగారావు ఊహించలేదు.. మళ్ళీ మరో రంగారావు లాంటి నటుడు ఇక పుట్టడు! ఒకవేళ అంతకు మించిన నటుడు ఎవరు పుట్టినా…ఎంతటి వాడు పుట్టినా…రంగారావు….రంగారావే! ఆయన స్థానం ఆయనదే! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *